Petrol Price : విదేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని పెంచుతోంది. దీనిలో భాగంగా అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న ఈ20 స్టాండర్డ్ ఇథనాల్ కంటే ఎక్కువ ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తొలగించారు.
అంటే ఈ22, ఈ25, ఈ27, ఈ30 పెట్రోల్‌పై ఎలాంటి కేంద్ర ఎక్సైజ్ పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ఫైనాన్స్, రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 22 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ అంటే.. అందులో 78 శాతం పెట్రోలో, 22 శాతం ఇథనాల్ ఉంటుంది. సాధారణంగా చమురు తయారీ కంపెనీలు ఎక్సైజ్ సుంకాల భారాన్ని వినియోగదారులపై మోపుతాయి. అయితే, ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కదా.. మరి పెట్రోల్ ధరలు తగ్గుతాయా అంటే లేదు. ఎందుకుంటే ఈ మినహాయింపు ప్రయోజనాన్ని ప్రస్తుతం కంపెనీలు మాత్రమే పొందుతున్నాయి. ఆ మేరకు వినియోగదారులకు పెట్రో ధరలు తగ్గించడం లేదు.
పైగా ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను చమురు సంస్తలు ఇంకా ఎక్కువగా అందుబాటులో ఉంచలేదు. ఎందుకంటే ఇంత ఇథనాల్ వినియోగించే సామర్ధ్యం ఉన్న వాహనాలు మార్కెట్లో లేవు. ఇథనాల్ ఎక్కువగా ఉన్న పెట్రోల్ వాడితే, ఇతర వాహనాలు త్వరగా పాడవుతాయి. అందుకోసమే ఇప్పుడు కంపెనీలు మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యుయెల్ వాహనాల్ని తీసుకొస్తున్నాయి. హీరో సంస్థ హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యుయెల్ వాహనాలు మాత్రమే ఇలా అందుబాటులో ఉన్నాయి.