పాట్నా, ఏప్రిల్ 29: బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు నగదు కొరత ఏర్పడటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ప్రకటించిన పలు సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర నగదు కొరత ఏర్పడింది. దాంతో వాటిని ఆపలేక, కొనసాగించ లేక ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అలవికాని ఉచిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి వాటిని నెరవేర్చేందుకు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నది.
ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే మార్చి నెలాఖరులో ప్రభుత్వం పలు ప్రజా ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దమొత్తంలో నిధులను వెచ్చించింది. కాగా, బీహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రస్తుతం కేంద్రం నుంచి బదిలీ కావాల్సిన రూ. 8,500 కోట్ల నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నది. అంతేకాకుండా కొత్తగా సీఎం పదవిని అధిష్ఠించిన బీజేపీ నేత సమ్రాట్ చౌధురీ రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.12,000 కోట్ల రుణం కోసం ఎదురు చూస్తున్నారు. అవి వస్తే ప్రస్తుతానికైతే ఉద్యోగుల జీతాల గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం బీహార్ భారీ రుణభారంతో సతమతమవుతున్నది. 2026-27 ఏడాదికి మొత్తం రుణం సుమారు రూ. 4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. రాష్ర్టానికి వచ్చే ఆదాయం కన్నా రుణదాతలకు చెల్లించాల్సిన అప్పులే భారీగా ఉన్నాయి. బీహార్ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.47 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ను ఆమోదించింది. బీహార్ బడ్జెట్లోని సింహభాగం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చవుతున్నది.
స్కూల్ బాలికలకు ఉచితంగా సైకిల్ ఇచ్చే ముఖ్యమంత్రి సైకిల్ యోజన, ఆడపిల్ల చదువుకు ఆర్థిక సహాయం అందించే కన్యా ఉత్తన్ యోజన, ఉన్నత విద్యాభ్యాసానికి విద్యార్థులకు రూ.4 లక్షల వరకు రుణం అందించే స్టూడెంట్ క్రెడిట్ కార్డు, ఉచిత విద్యుత్ కనెక్షన్ వంటి పథకాల అమలుకు ప్రభుత్వానికి నిధులు చాలా అవసరం. ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు ఈ పథకాల అమలుకు సరిపోవడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడి, ప్రస్తుతం ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించ లేని పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.