మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 19:01:41

నేటి గూగుల్‌ డూడుల్‌లో ఉన్నది ఎవరో తెలుసా?

నేటి గూగుల్‌ డూడుల్‌లో ఉన్నది ఎవరో తెలుసా?

హైదరాబాద్‌: నేటి గూగుల్‌ డూడుల్‌ చూశారా? అందులో ఉన్న పెద్దమనిషిని గుర్తుపట్టారా? గూగుల్‌.. డూడుల్‌గా ఆయనను నేడు ఎందుకు ఎంచుకుందోనని ఆలోచిస్తున్నారా? అయితే, తెలుసుకోండి. గూగుల్‌డూడుల్‌లో ఉన్నది భారతదేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, రచయిత  పురుషోత్తం లక్ష్మణ్‌దేశ్‌పాండే.  ఆయన రచయిత, నాటక రచయిత, సంగీతకారుడేకాక స్వరకర్త, నటుడు, దర్శకుడు, పరోపకారి. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. అందుకే ఆయన  101 వ జయంతి సందర్భంగా గూగుల్‌.. డూడుల్‌ద్వారా ఘన నివాళి అర్పించింది.  

పురుషోత్తం లక్ష్మణ్‌దేశ్‌పాండేను పూలా దేశ్‌పాండేగా పిలుస్తారు. ఆయన ముంబైలో 1919 లో జన్మించారు. దేశ్‌పాండే మరాఠీ సాహిత్యం, ప్రదర్శన కళలల్లో విశేష ఖ్యాతి గడించారు. అలాగే, ఆయన ఆనందకరమైన హాస్యం, సెటైర్లు వేయడంలో ప్రసిద్ధులు. హార్మోనియం మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన మాస్టర్‌ డిగ్రీ పొందారు. సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకునేముందు లెక్చరర్‌గా పనిచేశారు. మరాఠీలో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘నాచ్‌ రే మోరా’పాటను స్వరపరించింది ఆయనే. చాలామంది ప్రముఖులతో కలిసి పనిచేశారు. అలాగే, సొంతంగా పాటలను రికార్డింగ్‌ చేశారు.  ఆయన విశిష్టమైన సంగీత వృత్తితోపాటు అనేక నవలలు, వ్యాసాలు, కామెడీ పుస్తకాలు, ప్రయాణ కథనాలు, పిల్లల నాటకాలు, వన్ మ్యాన్ స్టేజ్ షోలతో గొప్ప రచయితగా పేరు పొందారు. కాగా, గూగుల్‌ డూడుల్‌లో ఉన్న చిత్రాన్ని ముంబైకి చెందిన కళాకారుడు సమీర్ కుల్వానూర్ రూపొందించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.