భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో ఇటీవల కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఒడిశాలో అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో నైతిక బాధ్యతగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ అధికార పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆరు నెలల 13 రోజులకు ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆదివారం ప్రకటించారు. తనను ఎంతో ఆదరించిన ఒడిశాను, గురువు నవీన్ బాబును గుండెల్లో ఉంచుకుంటానని ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సహాయ పడటానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే తాను 2024 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదని, ఎలాంటి పదవులు చేపట్టలేదని ఆయన చెప్పారు.
ఈ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం కారణంగా బీజేడీ ఓడిందని భావిస్తే అందుకు కార్యకర్తలకు, ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాన్నారు. అలాగే ఈ ప్రయాణంలో ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని కోరారు. కాగా, 24 ఏండ్ల బీజేడీ పాలనకు బీజేపీ ఈ ఎన్నికల్లో పగ్గాలు వేసింది. 147 సీట్లలో 78 గెల్చుకుని తొలిసారి ఒడిశాలో అధికారం చేపట్టనుంది. కాగా, బీజేడీ 51 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. నవీన్ పట్నాయక్ ఆరోసారి సీఎం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పాండియన్ ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. కాగా, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన పాండియన్‌ను ఒక సమయంలో నవీన్ వారసుడిగా అందరూ పేర్కొన్నారు.