Nishikant Dubey | పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే (expulsion as MP). మహువా బహిష్కరణపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే (Nishikant Dubey) శనివారం తొలిసారి స్పందించారు. ఆమె బహిష్కరణ తనకు బాధను కలిగించిందంటూ వ్యాఖ్యానించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్యపై ఒక పార్లమెంటేరియన్ బహిష్కరణకు గురికావడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. నిన్న (మహువా బహిష్కరణకు గురైన రోజు) సంతోషకరమైన రోజు కాదు. అదో విచారకరమైన రోజు’ అంటూ వ్యాఖ్యానించారు.
మహువా బహిష్కరణకు దూబే ఆరోపణలే కారణమన్న విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ గురించి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్ లాగిన్ ఉపయోగించానని అక్టోబర్ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు.
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం గర్భగుడి ఇలా ఉంటుంది.. ఫొటోలు వైరల్
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, పాడి కౌశిక్ రెడ్డి
KCR | శస్త్రచికిత్స తర్వాత వాకర్ సాయంతో నడిచిన కేసీఆర్