Women’s Reservation Bill | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి దేశానికి ప్రధాని మోదీ. కీలకమైన హోం శాఖకు అమాత్యులు అమిత్ షా. పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఆషామాషీ బిల్లు ఏమీ కాదు. రాజ్యాంగ సవరణకు సంబంధించినది. అలాంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎంతమందితో చర్చించాలి? ఎన్ని రాజకీయ పార్టీలతో మదింపు జరుపాలి? అయితే, ఇవేమీ పట్టించుకోని కేంద్ర సర్కార్ లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చింది.
తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మహిళా బిల్లుతో, డీలిమిటేషన్ను లింక్ పెట్టింది. 50 శాతం సీట్లను సమంగా పెంచుతామని మౌఖికంగా చెప్తూ.. బిల్లులో ఆ ప్రస్తావన లేకుండా దాచింది. పైగా ఈ బిల్లును వ్యతిరేకిస్తే, మహిళా ద్రోహులేనంటూ విపక్షాలను టార్గెట్ చేయాలనుకొంది. అయితే, తర్వాత జరిగే పరిణామాలపై ఏ మాత్రం కసరత్తు చేయని బీజేపీ ప్రభుత్వానికి విపక్ష పార్టీ నేతలు అదే స్థాయిలో చుక్కలు చూయించారు.
మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వేరు చేస్తారా? ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం 50 శాతం సీట్లు పెంచుతారా? అంటూ ప్రతిపక్ష నేతలు నిలదీశారు. దీంతో ఏం చేయాలో అర్థంకాని హోంమంత్రి అమిత్ షా.. 50% పెంచుతూ సవరణ తీసుకొచ్చేందుకు సిద్ధమంటూనే.. గంట సమయం ఇస్తే బిల్లులో సవరణలు చేసుకొని వస్తానని పార్లమెంట్ సాక్షిగా సెలవిచ్చారు. పక్కనే మోదీ కూడా ఉన్నారు.
దీంతో కసరత్తు లేకుండా ఎందుకు బిల్లు తెచ్చారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అందరికీ అమోదయోగ్యంగా ఉండే స్పష్టమైన బిల్లు తీసుకురాకపోవడంతోనే ఓటింగ్లో ఆ బిల్లు వీగిపోయిందని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏండ్లలో వీగిపోయిన తొలి బిల్లు ఇదేనని, ఇది మోదీ సర్కారుకు అతి పెద్ద దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు.