పనాజీ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మితవాద వక్త గౌతమ్ ఖట్టర్‌ను (Gautam Khattar) హిమాచల్ ప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నమోదైన కేసుపై దర్యాప్తు కోసం గోవాకు తరలించారు. సనాతన్ మహాసంఘ్ సంస్థ వ్యవస్థాపకుడైన గౌతమ్ ఖట్టర్ ఏప్రిల్ 18న జరిగిన కార్యక్రమంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. గోవాలో అత్యంత పూజ్యుడు, బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చిలో పవిత్ర అవశేషాలు భద్రపరచిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆధ్యాత్మిక గురువు స్వామి బ్రహ్మేశానంద్, గోవా రవాణా శాఖ మంత్రి మౌవిన్ గోడిన్హో, బీజేపీ ఎమ్మెల్యేలు సంకల్ప్ అమోంకర్, దాజీ (కృష్ణ) సాల్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, గౌతమ్ ఖట్టర్ ప్రసంగం వివాదాన్ని రేకెత్తించింది. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఆయనపై కేసు నమోదైంది. గోవా కోర్టు గతంలోనే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న గౌతమ్ ఖట్టర్ కోసం గోవా పోలీసులు వెతికారు.
మరోవైపు గౌతమ్ ఖట్టర్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నట్లు గోవా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుల్లు జిల్లాలో ఉన్న ఆయనను శనివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు వెళ్లారని, గౌతమ్‌ను గోవాకు తరలిస్తారని ఎస్పీ తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి అతడి సోదరుడు మాధవ్‌ను బుధవారం ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
nail house resistance | చైనా తరహాలో.. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ‘నెయిల్ హౌస్’ ప్రతిఘటన
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?