హవేరి: బెయిల్‌పై విడుదలైన రేప్ కేసు నిందితులు రోడ్ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం కలిగించింది. నిరుడు జనవరిలో హవేరిలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్ లభించింది. దీంతో ఈ నెల 20న వారికి హవేరి సబ్-జైలు వద్ద స్వాగతం లభించడం, వారు రోడ్ షోలో ఊరేగడం చర్చనీయాంశమైంది.
అయిదు వాహనాల కాన్వాయ్‌లో వారికి చెందిన 20 మద్దతుదారులు అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. నిందితులు అక్కి అలూర్ ప్రధాన వీధుల్లో ఊరేగడం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో నిందితుల్లో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ర్యాష్ డ్రైవింగ్, చట్టవిరుద్ధ సమావేశం ఆరోపణలతో వీరిపై కేసులు నమోదు చేసి మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నామని హవేరి ఎస్పీ అన్షుకుమార్ శ్రీవాస్తవ తెలిపారు. రేప్ కేసు బాధితురాలు కోర్టులో వీరిని సరిగా గుర్తించలేకపోవడంతో వీరికి బెయిల్ మంజూరైంది. బాధితురాలు తన భాగస్వామితో ఒక హోటల్లో ఉన్నప్పుడు నిందితులు వారిద్దరిపై దాడి చేసి ఆమెను లాక్కెళ్లి కొంత సేపటి తర్వాత లాడ్జి దగ్గర దిగబెట్టారు. లాడ్జి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.