వాపీ, ఆగస్టు 29: బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు. వాపీ తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే ప్రధాన వంతెన శిథిలం కావడంతో మూడేండ్ల క్రితం అధికారులు దానిని కూల్చివేశారు.
అయితే రూ.140 కోట్ల అంచనాతో కొత్త వంతెన నిర్మాణం ప్రారంభమైనా పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో 20 నిమిషాల ప్రయాణానికి గంటలపాటు ప్రయాణించాల్సి వస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపుతూ.. వినాయక నవరాత్రుళ్లు సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశ మండపంలో గణనాథుని పక్కనే పాత వంతెన నమూనాను ఏర్పాటు చేశారు. ఇది చూసైనా అధికారుల్లో చలనం వస్తుందని భావిస్తున్నామని మండపాన్ని ఏర్పాటు చేసిన భాగ్యోదయ సొసైటీ పేర్కొంది.