గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 23:07:14

ఇక నుంచి జియో టీవీ యాప్‌లో ఉచితంగా టి-శాట్ పాఠాలు

ఇక నుంచి జియో టీవీ యాప్‌లో ఉచితంగా టి-శాట్ పాఠాలు

హైదరాబాద్: తెలంగాణప్రభుత్వ ఎడ్యుకేషన్ చానల్ టి-శాట్ ను ఇక నుంచి జియో టీవీ యాప్‌లోను ఉచితంగా వీక్షించవచ్చు. తెలంగాణలోని 1.59 కోట్ల మంది జియో కస్టమర్లు, దేశంలోని 40 కోట్లమంది వినియోగదార్లు కూడా జియో టీవీ యాప్ ద్వారా టీ-శాట్ చానల్‌ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు ఎడ్యుకేషనల్ ఈ-కంటెంట్‌ను తమ మొబైల్ ఫోన్లును దేశంలోని ఎక్కడి నుండైనా సులభంగా చూడవచ్చు. విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రసారాలు అందించడంలో ముందు వరసలో ఉన్న టి-శాట్ నెట్‌వర్క్ చానల్స్ దీని ద్వారా మరో ముందడుగు వేశాయి. ప్రయివేటు కమ్యునికేషన్ రంగంలోని జియో టీవి యాప్ ద్వారా ఉచితంగా టి-శాట్ ప్రసారాలు అందించేందుకు టి-శాట్ నెట్ వర్క్ సిద్ధమైంది.

ఈ మేరకు టి-శాట్, జియో టీవి నెట్ వర్క్ విభాగాలు గురువారం నుండి ప్రసారాలు అందించాలని నిర్ణయించాయి. కరోనా ప్రభావం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యారంగానికి ఆన్‌లైన్ ప్రసారాలు అందిస్తున్న టి-శాట్ విద్య, నిపుణ చానళ్ల ప్రసారాలకు జియో టీవి యాప్ ద్వారా మరింత వెసులుబాటు కలగనుంది. ఇప్పటికే 24 గంటల ప్రసారాలతో నాలుగు లక్షల సబ్‌స్క్రైబ్స్ కలిగి ఉన్న టి-శాట్ యాప్ తెలంగాణలోని 1.59 కోట్ల జియో కస్టమర్లకు ప్రసారాలు అందనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నలభై కోట్ల జియో కస్టమర్లకు టి-శాట్ ప్రసారాలు ఉచితంగా చేరుతాయి.

జియో సంస్థ దేశ వ్యాప్తంగా ప్రసారం చేసే 700 చానళ్లలో 64 ఛానళ్లు విద్యకు సంబంధించినవి ఉండగా వాటి చెంతకు టి-శాట్ నెట్ వర్క్ చానళ్లు చేరాయి. ఈ ప్రసారాలు వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో ఉండటం విద్యార్థులకు మరో అదనపు అవకాశంగా భావించాలి. పాఠశాల విద్యతో పాటు ఉన్నత స్థాయి, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రసారాలు, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్య ప్రసారాలు, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తూ సేవలందిస్తున్న టి-శాట్‌కు జియో టీవి నెట్ వర్క్ తోడవడం సంతోషమని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


 


logo