న్యూఢిల్లీ : బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఉచిత శిక్షణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీల) విద్యార్థులతోపాటు పీఎం కేర్స్ పథకం లబ్ధిదారులు కూడా ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులవుతారు. వీరికి వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ లభిస్తుంది. సామాజిక వర్గం, ఆదాయ పరిమితి వంటివాటితో సంబంధం లేకుండా పీఎం కేర్స్ లబ్ధిదారులు ఈ అత్యున్నత స్థాయి ఉచిత శిక్షణను పొందవచ్చు.
యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆఫీసర్ గ్రేడ్ నియామక పరీక్షల కోసం వీరు ఉచితంగా శిక్షణ పొందవచ్చు. ఇంజినీరింగ్ (ఐఐటీ-జేఈఈ), మెడిసిన్ (నీట్), మేనేజ్మెంట్ (క్యాట్), న్యాయశాస్త్రం (సీఎల్ఏటీ), విదేశీ విద్య (జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, ఎస్ఏటీ) వంటి ప్రవేశ పరీక్షలకు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణను ఇస్తారు.