ఘజియాబాద్ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై నలుగురు బాలురు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘజియాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ముగ్గురు ఆ బాలిక పాఠశాలలో చదువుకుంటున్నప్పటి నుంచి తెలిసినవారే. బాధితురాలు ఒక బాలునితో ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్‌లో ఉండేది.
ఆ బాలుడు ఆమెను కలుస్తానని మెసేజ్ పెట్టి ఆమె ఇంటికి వచ్చాడు. అతడి వెంట మరో ముగ్గురు బాలురు ఉన్నారు. ఆ సమయంలో బాధితురాలి తల్లి మార్కెట్‌కు వెళ్లింది. బాలురు ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికదాడి చేశారు. ఇంతలో బాధితురాలి తల్లి వచ్చి విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం దవాఖానకు పంపించారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.