పాట్నా: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జారీ అయిన లేఖను పురస్కరించుకుని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియచేస్తూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖను సోషల్ మీడియాలో సింగ్ షేర్ చేశారు.
అవినీతిని అంతం చేసి నేరమయ రాజకీయాలను నిర్మూలించే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని అసౌకర్యానికి గురిచేసినట్లు కనపడుతోందని సింగ్ పేర్కొన్నారు. ఆర్కే సింగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, సంస్థాగత క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘించారని అంతకు ముందు బీజేపీ ఆరోపించింది. ఇదే తరహా ఆరోపణలపై బీహార్‌కు చెందిన ఎంఎల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్టున్నట్లు బీజేపీ ప్రకటించింది. అదానీ గ్రూపునకు చెందిన విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగినట్లు సింగ్ ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.