న్యూఢిల్లీ, జూన్ 8: ఓ అవినీతి కేసులో తనను ఇరికించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించిందని, తనపై సీబీఐని ప్రయోగించి..బెదిరించేందుకు ప్రయత్నం జరిగిందని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో తాను ఐసీయూలో చేరినట్టు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. తనకు ఏదైనా జరగరానిది జరిగితే, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ గురించి దేశం తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన పోస్ట్ చేశారు.
అవినీతి కేసులో తనను అప్రతిష్ట పాల్జేసేందుకు కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు. ఒక టెండర్ విషయంలో రూ.150 కోట్లు లంచా న్ని తనకు ఆఫర్ చేయగా..తిరస్కరించిన సంగతిని ప్రధాని మోదీకి స్వయంగా తెలియజేశానని ఆయన అన్నారు. గవర్నర్గా తనను బదిలీ చేశాక, మరొకరి సంతకంతో సంబంధిత టెండర్ ఆమోదం పొందిందని, తనపై ఆరోపణల్లో వాస్తవాల్ని ఇప్పటికైనా బయటపెట్టాలని కోరారు.