భువనేశ్వర్: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను నిర్ణయించడానికి జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను అమలు చేసే ముందు అన్ని పార్టీలతో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. డీలిమిటేషన్‌పై చెన్నైలో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.
పునర్విభజనపై వివిధ పార్టీలకు ఉన్న సందేహాలను కేంద్రం తీర్చాలని ఆయన సూచించారు. ఒక వేళ అప్పట్లో తమతో పాటు పలు దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ చేయకపోతే భారత్‌లో జన విస్ఫోటం జరిగి ఉండేదని, తద్వారా మన అభివృద్ధి ప్రగతి పట్టాలు తప్పేదని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఒడిశా సంతానోత్పత్తిని తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2026 జనాభా ప్రాతిపాదికన సీట్లను కేటాయిస్తే ఒడిశా రాష్ట్రం అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ సీట్లను కూడా కోల్పోతుందని అన్నారు.