న్యూఢిల్లీ : అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఓ నగల దుకాణంలోని 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రదేశం ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది. చైనాలోని షాంగ్జి ప్రావిన్స్, యుకీ కౌంటీలో జూలై 25న జరిగిందీ ఘటన. లావోఫెంగ్జియాంగ్ అనే ఈ జువెలరీ షాపును ఉప్పెన ముంచెత్తింది. దీంతో అందులోని ఆభరణాలు వరదలో కొట్టుకుపోయాయి..
వరదలో కొట్టుకుపోయిన ఆభరణాల్లో నెక్లెస్లు, గాజులు, ఉంగరాలు, చెవి రింగులు, పెండెంట్లు, వజ్రపుటుంగరాలతోపాటు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. కొట్టుకుపోయిన నగల విలువ 10 మిలియన్ యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 కోట్లు) ఉంటుందని దుకాణ యజమాని తెలిపాడు. కొట్టుకుపోయిన వెంటనే వెతుకులాట ప్రారంభించగా ఇప్పటి వరకు ఒక్క కిలో వస్తువులు మాత్రమే దొరికాయని షాపు యజమాని తెలిపాడు. ఇక విషయం తెలిసిన ఆ ప్రాంత వాసులైతే ఆ రోజు నుంచి నేటి వరకు బంగారం వెతుకులాటలో మునిగి తేలుతున్నారు.