శ్రీనగర్, సెప్టెంబర్ 14: ప్రధాని మోదీ పర్యటన వేళ జమ్ము కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బారాముల్లా, కిష్ట్వర్ జిల్లాల్లో మూడు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. నాలుగు రోజుల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు తీవ్ర కలకలం రేపాయి.
శుక్రవారం బారాముల్లాలో భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీస్ సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. శనివారం ఉదయం పట్టాన్ ప్రాంతం చాక్ టాపెర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శుక్రవారం కథువాలో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.
ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ‘ఎక్స్’లో తెలిపారు. ఎన్నికల ప్రచార నిమిత్తం దోడా జిల్లాలో మెగా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. భారత ప్రధాని దోడా జిల్లాలో పర్యటించటం 42 ఏండ్లలో ఇదే తొలిసారి.