Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. న్యూఢిల్లీలోని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయ బిల్డింగ్ గేట్ నెంబర్ 4 వద్ద కొత్త బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన ఫొటోను ఏర్పాటు చేశారు.
ఈ ఫొటో అక్కడున్న వారిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటో ద్వారా ఇండియాలో అందుబాటులోకి రానున్న తొలి బుల్లెట్ ట్రైన్ నిర్మాణంపై ఒక స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఇండిమా తొలి బుల్లెట్ ట్రైన్‌గా నిలవనున్న ఈ రైలు ముంబై–అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణిస్తుంది. ఇది వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగష్టు 15న అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ముంబై నుంచి అహ్మదాబాద్.. అహ్మదాబాద్ నుంచి ముంబై రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు మొత్తం 508 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి నగరాలలో ప్రయాణిస్తుంది.
ఈ బుల్లెట్ ట్రైన్ ఆగేందుకు ప్రత్యేక స్టేషన్ల నిర్మాణం కూడా కొనసాగుతోంది. ఇది మొత్తం 17 నదుల పై నున్న బ్రిడ్జిల మీద నుంచి ప్రయాణిస్తుంది. ఇందులో ప్రముఖమైన నర్మదా, మహి, తప్తి, సబర్మతి నదుల మీదుగా కూడా వెళ్తుంది. ఈ రైలు కోసం పట్టాల నిర్మాణానికి అవసరమైన 1,389.5 హెక్టార్ల భూమని ప్రభుత్వం సేకరించింది. ఈ రైలు కోసం ముంబై పరిధిలోని విక్రోలిలో ఒక భారీ టన్నెల్ తవ్వుతున్నారు. 13.6 మీటర్ల డయామీటర్‌తో ఇది 16 కిలోమీటర్లు ఉంటుంది.