ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు కోసం చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కరకన్గుండ అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు.
జవాన్లు కాల్పుల్లో వేగం పెంచడంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత భద్రతా దళాలు అ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ, మందుగుండు, వస్తు సామగ్రిని భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.