చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటల కారణంగా పొగ అలుముకోవడంతో రోగుల తరలింపు కష్టసాధ్యంగా మారింది.
దవాఖానలోని ఓ పాత భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందని మిగిలిన మూడు బ్లాక్లు సురక్షితంగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జే. రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదం కారణంగా ప్రాణ నష్టం, ఎవరికీ గాయాలైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.