Delhi air pollution: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ముందుగా.. కాలుష్యానికి గల కారణాలు గుర్తించాలని సూచించింది. ఈ మేరకు వాయు కాలుష్యంపై ఏర్పాటైన క్యామ్ (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్)కు ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యానికి పరిష్కారాలు వెతకడానికి ముందు.. కారణాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని సూచించింది.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సమస్యకు మూలాలు, కారణాలు కనుక్కోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా లాభం లేదని అభిప్రాయపడింది. రెండు వారాల్లోగా వివిధ రంగ నిపుణులను గుర్తించి, వారితో చర్చించి, ఢిల్లీ వాయు కాలుష్యానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించింది. వివిధ రంగాలకు చెందిన నిపుణుల్ని గుర్తించి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, సరైన వివరాలు నమోదు చేయడం క్యామ్ బాధ్యత అని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచి, జవాబుదారీతనాన్ని పాటించాలని సూచించింది. వాయు కాలుష్యంపై కోర్టుకు పూర్తి అవగాహన లేకపోవచ్చని, అయితే, నిపుణుల ద్వారా సరైన నిర్ణయం తీసుకునేలా చూస్తామని తెలిపింది.
సమస్యలు గుర్తిస్తే, పరిష్కారం అదే లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఎక్కువ వాయు కాలుష్యానికి కారణమవుతున్న వాటిని ముందుగా గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్లాలని, అయితే, క్యామ్ కు అంత తొందరేం కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఏటికేడు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించాలని సూచించింది. కాలుష్యానికి కారణమవుతున్న నిర్మాణాలు, వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరింది.