న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనకు గతంలోనే ఉద్యమాలు ప్రారంభించిన రైతులు.. దానిని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి జాతగా శంభు, ఖనౌరి సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ తెలిపారు. గురువారం ఆయన శంభు సరిహద్దులో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ పాదయాత్రను అడ్డుకుంటే అది తమ నైతిక విజయం అవుతుందని అన్నారు.
డిమాండ్ల సాధనకు రైతుల పాదయాత్రను పురస్కరించుకుని ఇప్పటికే ఎన్‌హెచ్ 44పై రైతులు పెద్దయెత్తున గుమిగూడి ఉన్న క్రమంలో హర్యానా, పంజాబ్‌లు శంభు సరిహద్దుకు రెండు వైపులా భద్రతను మరింత పటిష్ఠం చేశాయి. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. గురువారం హర్యానా పోలీసులు పంజాబ్ వైపు సరిహద్దులో అదనంగా మూడంచెలబారికేడ్లనుఏర్పాటు చేశారు.