న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు. జాతీయ రహదారి 44పై ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని రావడానికి ప్రయత్నించిన రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఒక రైతు నేత, వృద్ధ రైతుతో పాటు మరికొందరు గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లలో దవాఖానలకు తరలించారు.
పోలీసుల బాష్పవాయువు ప్రయోగంతో శుక్రవారం తమ పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని, ఆదివారం తమ యాత్రను పునఃప్రారంభిస్తామని రైతు నేత శర్వణ్ సింగ్ పాంథేర్ ప్రకటించారు. టియర్ గ్యాస్‌తో రైతు నేత సుర్జీత్ సింగ్ ఫుల్ సహా 8 మంది రైతులు గాయపడ్డారని ఆయన చెప్పారు.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో మధ్యాహ్నం 101 మంది రైతులతో ప్రారంభించిన ర్యాలీ జాతీయ రహదారి 44పై ఉన్న బారికేడ్ల వద్దకు చేరుకుంది.బారికేడ్లను ఛేదించుకుని రాజధాని ఢిల్లీ వైపు రావడానికి రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని బాష్ప వాయువును ప్రయోగించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.కాగా, ఈనెల 9 వరకు అంబాల జిల్లాలోని 11 గ్రామాలకు ఇంటర్నెట్ను బంద్ చేయడమే కాక, బల్క్ మెసేజ్‌ల సర్వీసులను నిలిపివేసినట్టు అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు అంబాల జిల్లా అధికారులు చెప్పారు.
రైతుల ఆందోళన ప్రారంభానికి ముందు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ‘ఇది మోదీ ప్రభుత్వం.. మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆయన ప్రకటించారు.