న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు. ఉద్యమాన్ని విరమించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం రైతాంగ ఆందోళనలు జరిగాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషన్ సిటీ క్యాంపస్‌లో రైతుల మహాపంచాయత్ జరిగింది. ముందుగా రైతు అమరులకు వారు నివాళులర్పించారు.
పంజాబ్, హర్యానాతో పాటు సమీప రాష్ర్టాల రైతులు భారీగా తరలివచ్చారు. హామీలను నెరవేర్చకుంటే మరోసారి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని రైతు నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు. ఈసారి ఉద్యమం గతం కంటే మరింత బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరుల కుటుంబాలకు పరిహారం తదితర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఆదివారం హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన మహాపంచాయత్‌లో పాల్గొన్న రైతులు
అంతకుముందు కుండ్లి-సింఘూ సరిహద్దు వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాపంచాయత్‌లో రైతు నేతలు మాట్లాడుతూ హామీల అమలులో బీజేపీ సర్కార్ మోసం చేసిందని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చకుండా జిమ్మిక్కులు చేస్తున్న బీజేపీ సర్కార్‌ను అంత తేలిగ్గా వదిలేది లేదని హెచ్చరించారు. లఖీంపూర్ హింసాకాండలో న్యాయం జరగులేదని అన్నారు. పంజాబ్, హర్యానా రైతులు హర్యానాలోని బహదూర్‌నగర్ నుంచి ఢిల్లీ సరిహద్దు టిక్రీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతన్నలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని రాకుండా అడ్డుకొనేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.