అమృత్సర్, హోషియాపూర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లోని చాలా ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కేంద్రాన్ని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు ఈ మార్చ్‌ను నిర్వహించాయి.
అమృత్‌సర్‌లో జాతీయ జెండాలను అలంకరించిన 600 ట్రాక్టర్లతో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతు నాయకుడు సర్వణ్ సింగ్ పంధేర్ నేతృత్వంలో 30 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు శంభు, ఖన్నూరి వద్ద తమ నిరసనలను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఢిల్లీ చలో మార్చ్ జరిగి 200 రోజులు పూర్తయ్యే సందర్భంగా ఈ నెల 31న శంభు, ఖన్నూరి సరిహద్దుల్లో మహా పంచాయత్‌లు నిర్వహిస్తామని తెలిపారు.
మరిన్ని చిన్న వార్తలు
సామాజిక మాధ్యమాలపై దావా
టొరంటో: ప్రస్తుతం సమాజంలో చాలామంది సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారిపోతున్నారు.కెనడాలోని మాంట్రియల్‌కు చెందిన ఒక యువకుడు వీటిపై చర్య కోరుతూ న్యాయస్థానంలో దావా వేశాడు. టిక్ టాక్, యూట్యూబ్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. వ్యసనపరులుగా మార్చడమే కాక, వాటి కారణంగా పౌరుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆరోపించాడు. 2015 నుంచి తాను సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నానని, వీటి వల్ల ఉత్పాదకత, శరీరంలో పలు సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించాడు.
3 లక్షలమంది డాటా గల్లంతు
న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లను హ్యాకర్లు టార్గెట్ చేసుకున్నారని, ఫేక్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్లతో యూజర్ల కంప్యూటర్లలో మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని పరిశోధకులు తాజాగా హెచ్చరించారు. ప్రమాదకర ఎక్స్టెన్షన్లను డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా దాదాపు 3లక్షలకు పైగా గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ యూజర్ల కంప్యూటర్లు ప్రభావితమయ్యాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘రీజన్ల్యాబ్స్’ తాజా నివేదిక పేర్కొన్నది. దీంతో యూజర్ల వ్యక్తిగత డాటా, ఆర్థిక సమాచారం, పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి చిక్కాయని నివేదిక తెలిపింది. ప్రమాదకర ఎక్స్టెన్షన్లతో హ్యాకర్లు మరిన్ని దాడులు జరపవచ్చునని హెచ్చరించింది.