(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మోదీ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే, డబుల్ గ్రోత్ ఉంటుందంటూ కమలనాథులు ఊదరగొట్టినప్పటికీ, రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో రైతన్నలు రోడ్లమీదికి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టడం నిత్యకృత్యంగా మారింది. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతన్నలు ఆందోళనకు దిగగా, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఒడిశాలో రైతులు బంద్‌ను చేపట్టారు. మొత్తంగా అటు కేంద్రంలో.. ఇటు రాష్ర్టాల్లో అధికారాన్ని చేపట్టిన బీజేపీ పాలనలో తమ కష్టాలు రెట్టింపయ్యాయని అన్నదాతలు వాపోతున్నారు.
పత్తి, సోయాబీన్, కందికి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించాలని మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రైతులు గురువారం పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. పత్తి, కందికి క్వింటాల్‌కు రూ.12 వేలు, సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ. 7 వేలు ఎమ్మెస్పీగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పెడుతున్న కొర్రీలను ఎత్తేయాలన్నారు. వివిధ సాకులు చెప్తూ తమ పంటను అగ్గువకే విక్రయించాలని మార్కెట్ కమిటీలు, వ్యాపారులు ఒత్తిళ్లు తీసుకురావడంపై మండిపడ్డారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారకాలు, డీజిల్, విద్యుత్తు, కూలీల వేతనాలు ఇలా పెట్టుబడికి అవసరమైన వ్యయం గడిచిన 14 ఏండ్లలో ఎన్నో రెట్లు పెరిగిందని గుర్తు చేసిన అన్నదాతలు.. పంటకు గిట్టుబాటు ధర మాత్రం పెరుగలేదని వాపోయారు. దీంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, వ్యవసాయశాఖ మంత్రి దత్త ధార్నే.. రైతుల సమస్యలను, కష్టాలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మర్స్ రైట్స్ మూమెంట్ పేరిట ప్రభుత్వానికి మెమోరాండాన్ని అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ బీజేపీ పాలిత ఒడిశాలోని బార్ఘా జిల్లాలోని పద్మాపూర్ రైతులు నిరసనలను ఉద్ధృతం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 గంటలపాటు బంద్‌ను చేపట్టారు. మార్కెట్ వ్యవస్థల్లో లోపభూయిష్టంగా ఉన్న టోకెన్ సిస్టమ్‌ను రద్దు చేయాలని, కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు ఈ బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రైతులకు గడ్డుపరిస్థితులు మొదలయ్యాయి. యూరియా కోసం రేయింబవళ్లు రైతులు అరిగోస పడుతున్నారు. అటు హస్తంపార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన తమకు సరైన పరిహారాన్ని ఇవ్వలేదంటూ చిక్కమగళూరులో ఉన్న శృంగేరీ రైతులు నిరసనకు దిగారు. ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించినప్పటికీ, నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళనలు చేపట్టారు.