న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా పంజాబ్, మధ్యప్రదేశ్సహా అనేక రాష్ర్టాలలో రైతులు నిరసనలు తెలిపారు. పంజాబ్లోని ఫరీద్కోట్లో రైతులు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గోధుములు, జొన్నలు, పౌల్ట్రీ, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తే భారతీయ వ్యవసాయం నాశనం అవుతుందని రైతులు హెచ్చరించారు. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు, భారీ సబ్సిడీలు అనుభవిస్తున్న అమెరికా రైతులు సగటున మూడు ఎకరాలు కూడా లేని భారతీయ రైతులతో పోటీ పడడం తగదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం 40 శాతం సుంకాలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్నాయని, వాటిని తొలగించడం వల్ల భారతీయ మార్కెట్లోకి తక్కువ ధరలకే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు వరదలా వచ్చిపడతాయని వారు తెలిపారు. క్వింటాలు గోధుమలకు రూ.2,428 ఎంఎస్పీ భారత ప్రభుత్వం చెల్లిస్తుండగా అంతకన్నా తక్కువ ధరకే అమెరికా తన గోధుమలను ఇటీవల యూరపునకు విక్రయించిందని వారు తెలిపారు. ఇలా ఉండగా, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించినందుకు నిరసనగా మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో రైతులు మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాష్ట్రంలోని 10 జిల్లాలలో రైతులు నిరసన కొనసాగుతున్నట్లు ఎస్కేఎం మధ్యప్రదేశ్ విభాగం అధ్యక్షుడు బాదల్ సరోజ్ తెలిపారు. ట్రంప్ విధించిన అధిక సుంకాలు రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.