Punjab Bandh | రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు (Farmers) సంఘాలు సోమవారం పంజాబ్ బంద్‌కు (Punjab Bandh) పిలుపునిచ్చాయి. అన్నదాతల డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్ వ్యాప్తంగా కిసాన్ మజ్దూర్ మోర్చా (Kisan Mazdoor Morcha), సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) బంద్ చేపట్టింది. ఈ బంద్‌తో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది.
రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. రోడ్డు, రైలు మార్గాలను రైతులు దిగ్బంధించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ గేట్, బటిండాలోని రాంపురా ఫుల్, మొహాలీలోని ఐఐఎస్ఈఆర్ చౌక్ వద్ద ఎయిర్పోర్ట్ రోడ్డు, కురాలి రోడ్ టోల్ ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా – ఢిల్లీ హైవే, ఖరార్ – మొరిండా హైవే సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు.
పంజాబ్ అంతటా ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు మూతపడ్డాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కిపైగా రోడ్లను రైతులు బ్లాక్ చేశారు. దీంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రైతుల బంద్ రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ – పంజాబ్ మధ్య రాకపోకలు సాగించే దాదాపు 163 రైల్వే సర్వీసులకు రద్దయ్యాయి.
విమానాలు, వైద్య, పెళ్లి, ఉద్యోగ ఇంటర్వ్యూ సహా అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. రైతుల బంద్ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మొహాలి జిల్లా అంతటా దాదాపు 600 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. సీనియర్ పోలీస్ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.
Also Read..
Punjab Bandh | నో మిల్క్.. నో వెజిటబుల్స్.. నేడు పంజాబ్‌లో రైతుల బంద్
Spadex mission | స్పాడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు.. ప్రకటించిన ఇస్రో
Netanyahu | నెతన్యాహుకు ప్రొస్టేట్ గ్రంథి శస్త్రచికిత్స విజయవంతం.. ప్రకటించిన వైద్యులు