న్యూఢిల్లీ: చవకైన దీర్ఘకాల రుణాలను అందించాలని, తక్కువ పన్నులు అమలు చేయాలని, పీఎం కిసాన్ ఆదాయ మద్దతును రెట్టింపు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ స్టాక్హోల్డర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో శనివారం జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశంలో వారు ఈ డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో పలు సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై చర్చ జరిగింది.
వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని పెంచేందుకు లక్ష్య జోక్యాల ఆవశ్యకతను భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ విర్ జాఖర్ నొక్కి చెప్పారు. అలాగే, వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించడం, వార్షిక పీఎం కిసాన్ వాయిదాను రూ.6 వేల నుంచి రూ. 12 వేలకు పెంచడం వంటి ప్రాథమిక డిమాండ్లతోపాటు పీఎం ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంట బీమా కోసం కూడా రైతు ప్రతినిధులు వాదించారు. పురుగు మందులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కోరింది.
జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు కొమ్ము శనగలు, సోయాబీన్స్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టిసారించడంతోపాటు 8 ఏండ్లపాటు ఏడాదికి రూ.1000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాఖర్ ప్రతిపాదించారు. చర్చలకు కేంద్రం నిరాసక్తత! తమ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం నుంచి తమకు ఎటువంటి సందేశం రాలేదని, 101 మంది రైతులతో కూడిన ప్రతినిధి బృందం డిసెంబర్ 8న(ఆదివారం) ఢిల్లీకి బయల్దేరుతుందని పంజాబ్ రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్తెలిపారు