న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో చేస్తున్న మోసం బయటపడింది. నకిలీ ఉద్యోగ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. (Fake Airline Job Racket) తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగి, ఏడుగురు మహిళా టెలికాలర్లు వీరిలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇండిగో సహా ప్రముఖ విమానయాన సంస్థలకు రిక్రూటర్లుగా నమ్మిస్తున్నారు. ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పి ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారు.
కాగా, ఓఎల్ఎక్స్, ఇతర ఉద్యోగ పోర్టల్లలో నకిలీ ప్రకటనల ద్వారా ఉద్యోగార్థులను వీరు ఆకట్టుకుంటున్నారు. ఎయిర్‌లైన్ అధికారులుగా నటిస్తూ ఫోన్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజులు, యూనిఫాం ఛార్జీలు, జీతం కోసం బ్యాంకు ఖాతాల తెరిచే పేరుతో దరఖాస్తుదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పలు దశల్లో రూ.2,500 నుంచి రూ.15,000 వరకు వసూలు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఉద్యోగ స్కామ్‌లో ఒక వ్యక్తి రూ.11,000 పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుభాష్ నగర్, తిలక్ నగర్ ప్రాంతాల్లో నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. ప్రధాన నిందితుడు వికాష్ కుమార్ అలియాస్ విక్కీ (38) , అతడి సహచరుడు, టెలికాం కంపెనీ ఉద్యోగి బల్జీత్ సింగ్ (31)ను అరెస్టు చేశారు. కస్టమర్ల బయోమెట్రిక్ డేటా ఉపయోగించి మోసపూరితంగా సిమ్ కార్డులు వీరు జారీ చేసినట్లు దర్యాప్తులో తెలిసింది.
కాగా, గణేష్ నగర్, తిలక్ నగర్లో నిర్వహిస్తున్న అక్రమ కాల్ సెంటర్లపై పోలీసులు రైడ్ చేశారు. ఏడుగురు మహిళా టెలికాలర్లను అరెస్ట్ చేశారు. చరణ్‌జిత్ అలియాస్ చారు, షాలిని భరద్వాజ్, ఆర్తి కౌర్, పల్వీన్ కౌర్, నందిని, పూజా గుప్తా, శ్వేత అలియాస్ శివానీ సింగ్ వీరిని గుర్తించారు. జాబ్ పోర్టల్‌ల ద్వారా వారిని నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉద్యోగార్ధులకు కాల్ చేసి వారిని ఒప్పించడానికి ఒక్కొక్కరికి నెలకు రూ. 15,000 చెల్లిస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. 22 మొబైల్ ఫోన్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్, 19 సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల క్యూఆర్ కోడ్లు, ఎయిర్‌లైన్ పేర్లను పోలి ఉండే యూపీఐ ఐడీలు, వై-ఫై రౌటర్ స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఈ నకిలీ జాబ్ రాకెట్ ముఠా దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. 40 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిసిందన్నారు. అయితే చిన్నతరహా ఆర్థిక మోసాల వల్ల నష్టపోయిన పలువురు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఏడాదిగా వీరి మోసాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Also Read:
Woman Hit By Speeding Bike | స్కూటీని ఢీకొట్టిన రేసింగ్ బైక్.. యువతి మృతి, మరో మహిళకు గాయాలు
Watch: బెంగళూరు జైలులో ఇదీ పరిస్థితి.. ఫోన్లు మాట్లాడుతూ, టీవీ చూస్తున్న రేపిస్టులు, నేరస్తులు