తిరువనంతపురం: ఒక యువతికి దెయ్యం పట్టిందని అత్తింటి కుటుంబం ఆరోపించింది. ఒక మంత్రగాడిని ఇంటికి రప్పించారు. శరీరంలో ఆవహించిన దెయ్యాన్ని వెళ్లగొట్టే నెపంతోఆ మహిళను హింసించారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. (Woman Forced To Drink Alcohol) బీడీ స్మోక్ చేయించారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల అఖిల్ దాస్, ఒక యువతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, మరణించిన తమ బంధువుల ఆత్మ ఆ యువతిలో ప్రవేశించినట్లు అఖిల్ తల్లి ఆరోపించింది. నవంబర్ 2న 54 ఏళ్ల మంత్రగాడు శివదాస్‌ను వారి ఇంటికి రప్పించారు. యువతి శరీరంలో ఆవహించిన దెయ్యాన్ని వెళ్లగొట్టేందుకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహిళను హింసించారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. బీడీ స్మోక్ చేయించారు. బూడిద తినిపించారు. వాతలు పెట్టడంతోపాటు రాత్రి వరకు పలు గంటల పాటు ఆ యువతిని శారీరకంగా, మానసికంగా హింసించారు.
మరోవైపు ఆ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఈ సమాచారం తెలుసుకున్న ఆ మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
కాగా, మంత్రగాడు శివదాస్, ఆ మహిళ భర్త అఖిల్ దాస్, అతడి తండ్రి దాస్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన అఖిల్ తల్లి పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Duping Techie For Rs.14 Crore | దేవతగా చెప్పుకున్న మహిళ.. టెక్కీని రూ.14 కోట్లకు మోసగింత
Two Women Marry | సామాజిక కట్టుబాట్లను అధిగమించి.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
Watch: బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా.. రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు