Plane Crash | అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) సంభవించిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సమీపంలోని ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు మొత్తం 274 మంది వరకూ ప్రాణాలు కోల్పోవడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ఈ ప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నారు. భారీ శబ్దం రావడంతో మొదట భూకంపంగా, బాంబు పేలుడుగా భావించినట్లు ఓ స్థానిక మహిళ తెలిపింది. ‘మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న మాకు భారీ శబ్దాలు సాధారమే.
కానీ, ఈ సారి మా చెవులు పగిలిపోయేంతగా శబ్దం వచ్చింది. ముందుగా భూకంపం అనుకున్నాం. ఇల్లు, డైనింగ్ టేబుల్, వస్తువులు తీవ్రంగా ఊగిపోయాయి. తర్వాత బాంబు పేలిందేమే అనుకున్నాం. వెంటనే ఇంటి బయటకు వెళ్లి చూడగా.. విమానం కూలిపోయి కనిపించింది. ఆకాశం మొత్తాన్ని నల్లటి పొగ కమ్ముకుంది. ఎక్కడ చూసినా విమాన శిథిలాలు, మంటలే కనిపిస్తున్నాయి’ అంటూ ఓ మహిళ తమకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది.
మరో మహిళ మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో ఉండగా.. పెద్ద శబ్దం వచ్చింది. బయట మొత్తం నల్లటి పొగ కమ్ముకుంది. మంటలు ఒక భవనం నుంచి మరో భవనం వరకూ వ్యాపించాయి. భూకంపమో, లేక బాంబు పేలుడు సంభవించినట్లు అనిపించింది’ అని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో నివాసం ఉంటున్న బహదూర్ క్షత్రి అనే నివాసి ఘోర ప్రమాదం గురించి వివరించారు.
‘మా ఇల్లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోనే ఉంది. నాకు పెద్ద శబ్దం వినిపించింది. మొదట ఇది భారీ తుఫాను, భూకంపమో అనుకున్నా. ఇంతలో బయట నుంచి పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి. విమానం కూలిపోయిందంటూ ప్రజలు అరుస్తున్నారు. దీంతో బయటకు వెళ్లి చూడగా.. మొత్తం పొగే కనిపించింది. చుట్టూ మంటలే. హాస్టల్లోని మెస్‌లో ఉన్న విద్యార్థులు సహాయం కోసం అర్థనాదాలు చేస్తున్నారు. వెంటనే మేము వారిని కాపాడేందుకు అక్కడికి వెళ్లాము. ఆర్మీ సిబ్బందితోపాటు, శిథిలాల నుంచి ఐదుగురు విద్యార్థులను సజీవంగా రక్షించాము. కానీ వారి పరిస్థితి విషమంగా ఉంది. భయంకరమైన స్థితిలో ఉన్న మృతదేహాలను కూడా గుర్తించాము’ అని చెప్పుకొచ్చారు.
Also Read..
Manchu Lakshmi | ప్రమాదం జరిగిన రోజు ఎయిర్ ఇండియా ఫైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. పోస్ట్ వైరల్
Plane Crash | విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
Air India Plane Crash | ఎయిర్ఇండియా విమాన ప్రమాదం.. 274కు చేరిన మృతుల సంఖ్య