అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane Crash) ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెళ్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274కు చేరిందని తెలిపారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. ఇతరులు 33 మంది ఉన్నట్లు చెప్పారు.
ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్య్రూ ఉన్నారు. విమానం బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్పై కుప్పకూలడంలో ఒక్క ప్రయాణికుడు మినహా విమానంలో మిగిలిన అందరూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మెడికల్ కాలేజీకి చెందిన మరో 33 మంది కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వారిలో డాక్టర్లు, విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, మెఘానినగర్ ప్రాంతానికి చెందిన ఇతరులు ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.