Pralhad Joshi | ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా కొనుగోలు చేసే వస్తువులకు ఆన్లైన్ పేమెంట్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు (Extra Fee For Cash On Delivery) ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) వెల్లడించారు. దర్యాప్తు అనంతరం ఆయా సంస్థలపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలుపై ఓ యూజర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘వర్షాల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు జెప్టో, స్విగ్గీ, జొమాటో విధించే ఫీజులను పక్కనబెట్టండి. ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు, పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు పేరుతో ఏవేవో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలా నాకు రూ. 226 వసూలు చేశారు. ఇకపై యాప్ స్క్రోల్ చేస్తున్నందుకు కూడా ఫీజులేస్తారేమో..?’ అంటూ సదరు యూజర్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ పోస్టుకు ప్రైజ్ డీటెయిల్స్ కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ‘ఇలా చేయడం యూజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. దోపిడీ చేసే చీకటి విధానమే (Dark Patterns). దీనిపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించాం. అలాంటి ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్‌కు విషమిచ్చి ఉంటారు.. గాయకుడి మృతి కేసులో కీలక ట్విస్ట్
Truck Driver | మతి స్థిమితంలేని మహిళను ఎత్తుకెళ్లిన ట్రక్ డ్రైవర్..
I Love Mahadev: మహాదేవుడిని ఆరాధిస్తామా.. ప్రేమిస్తామా? ప్రశ్నించిన స్వామి అవిముక్తేశ్వరానంద