Amit Shah | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్నారు. దీంతో ‘జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధన్‌ఖడ్ గృహనిర్బంధంలో (House Arrest)లో ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖడ్ రాజీనామాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తాజాగా స్పందించారు. ఈ మేరకు ‘హౌస్ అరెస్ట్’ వార్తలను తీవ్రంగా ఖండించారు.
ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యల కారణంగా ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘రాజీనామాకు గల కారణాలను ధన్‌ఖడ్ సాబ్ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి.. పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా పని చేశారు. ఆయన రాజీనామా గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ధన్‌ఖడ్ రాజీనామాతో తదుపరి వీపీగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ప్రభుత్వం బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా (Vice Presidential nominee) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (B Sudershan Reddy) ఎంపిక చేశారు. వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా చూస్తే ఆయన ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read..
Rahul Mamkootathil | నటి లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్