న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో రెండు కేసులలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు (Sajjan Kumar) ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం ప్రకటించింది. ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్ ఈ తీర్పును వెల్లడించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి. 1984 నవంబర్ 1న ఢిల్లీలోని జనక్‌పురిలో జరిగిన హింసలో సోహన్ సింగ్, ఆయన అల్లుడు అవతార్ సింగ్ హత్యకు గురయ్యారు. నవంబర్ 2న వికాస్పురిలో గురుచరణ్ సింగ్‌ను నిప్పంటించి చంపారు.
కాగా, నాడు ఢిల్లీలో కీలక కాంగ్రెస్ నేత, ఎంపీ అయిన సజ్జన్ కుమార్ సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారణమని ఆరోపణలు వచ్చాయి. 2015 ఫిబ్రవరిలో ఈ రెండు కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. 2023 ఆగస్ట్‌లో అల్లర్లకు పాల్పడటం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి అభియోగాలను కోర్టు సమర్థించింది. అయితే హత్య, నేరపూరిత కుట్ర నేరాల నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. తాజాగా ఈ రెండు కేసుల్లో సజ్జన్ కుమార్ నిర్దోషిగా ఢిల్లీ కోర్టు పేర్కొంది.
మరోవైపు ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ హత్యలకు సంబంధించిన కేసులో గత ఏడాది ఫిబ్రవరి 25న ట్రయల్ కోర్టు సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.
అలాగే ఢిల్లీలోని పాలం కాలనీ ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఐదుగురి మరణానికి కారణమైనందుకు సజ్జన్ కుమార్‌ను దోషిగా ఢిల్లీ హైకోర్టు నిర్ధారించింది. 2018 డిసెంబర్ 17న జీవిత ఖైదు విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఆయన దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
Also Read:
steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం, పలువురికి గాయాలు