న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ అమర్ సాధురామ్ ముల్చందని బెయిల్ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం విచారించింది. ‘పీఎంఎల్ఏ ఎంత కఠినమైనప్పటికీ మేం చట్టానికి లోబడి నడుచుకోవాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి బెయిల్ ఇవ్వొచ్చు.’ అని కోర్టు పేర్కొన్నది. ముల్చందనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.