EPFO | న్యూఢిల్లీ, జూన్ 24: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్ఓ) తన క్లెయిమ్‌ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంచింది. అత్యవసరంగా డబ్బు కావాల్సిన వారికి ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రస్తుత ఆటో క్లెయిమ్‌ల ప్రక్రియ మాదిరిగానే ఈ క్లెయిమ్‌లు కూడా మూడు రోజుల్లో పరిష్కారం అవుతాయని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. దీంతో మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే పెద్ద మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.
కాగా, కొవిడ్ సమయంలో నగదు అత్యవసరమైన ఖాతాదారుల సౌకర్యార్థం ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. అడ్వాన్స్డ్ విత్‌డ్రా కింద ఇప్పటివరకు లక్షకు మించి నగదు ఉపసంహరించాలనుకునే సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. నాన్ ఆటో సెటిల్మెంట్ విధానంలో చందాదారులు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి మాన్యువల్‌గా వెళ్లి, అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చేది. దీనికి చాలా సమయం పట్టేది. కాగా ఆటో సెటిల్మెంట్ పెంపు ప్రతిపాదనను ఈ ఏడాది మార్చిలో ట్రస్టీల సెంట్రల్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ ఆమోదించినట్టు అధికారులు తెలిపారు.