Encounter | జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. పెట్రోలింగ్ బృందంపై కాల్పులు జరిపినట్లు సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని.. ఆ తర్వాత ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని.. దట్టమైన అటవీ ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందంపై కాల్పులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు.
అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. జూన్ 9 తర్వాత జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాద ఘటన జరుగడం ఇది ఆరోసారి. జూన్ తొమ్మిన తొలిసారి బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయగా.. తొమ్మిది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇండియా టుడే, న్యూ ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ (ICM) విడుదల చేసిన డేటా ప్రకారం.. జనవరి 2023 నుంచి జమ్మూ ప్రాంతంలో 29 ఉగ్రవాద సంఘటనల్లో 42 మంది పౌరులు, భద్రతా దళ సిబ్బంది మరణించారు.