Elon Musk | న్యూఢిల్లీ, జూన్ 16: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను హ్యాక్ చేసే ముప్పు ఉందని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంలను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు. ప్యూర్టో రికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు సంబంధించి వందలాది ఓటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని రాబర్ట్ ఆరోపించారు. ఈ మేరకు ఒక వార్తా కథనాన్ని ఆయన తన పోస్ట్‌కు జత చేశారు.
అదృష్టవశాత్తూ పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి, ఓట్ల లెక్కను సరి చేయడం జరిగిందని అన్నారు. పేపర్ ట్రయల్ లేని ప్రాంతాల్లో ఇదే జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ ప్రతి ఓటు లెక్కించారని, తమ ఎన్నికల్లో హ్యాకింగ్ జరగదని అమెరికా పౌరులు తెలుసుకోగలగాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ జోక్యాన్ని నివారించేందుకు మళ్లీ పేపర్ బ్యాలెట్లను వెనక్కు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.
మస్క్ వర్సెస్ రాజీవ్
మస్క్ చేసిన ట్వీట్ భారత్‌కు సంబంధించినది కాకపోయినప్పటికీ బీజేపీ నేత, గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన రాజీవ్ చంద్రశేఖర్ స్పందించి కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నెట్తో అనుసంధానం అయి ఉండే ఓటింగ్ యంత్రాలు వాడుతున్న అమెరికాకో, ఇతర ప్రాంతాలకో ఎలాన్ మస్క్ అభిప్రాయం వర్తిస్తుండొచ్చని పేర్కొన్నారు. సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారుచేయలేరనేలా అన్నింటినీ ఒకే గాటున కడుతూ మస్క్ చేసిన ప్రకటన తప్పు అని వ్యాఖ్యానించారు.
భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్టివిటీ ఏదీ ఉండదని పేర్కొన్నారు. ఈవీఎంలను రీప్రోగ్రామ్ కూడా చేయడానికి కుదరదని తెలిపారు. భారత్‌లానే ఈవీఎంలను తయారుచేయవచ్చని, అవసరమైతే దీనిపై శిక్షణ ఇవ్వడానికి కూడా సంతోషమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మస్క్ మరోసారి స్పందిస్తూ.. ‘ఏదైనా హ్యాకింగ్ చేయడం సాధ్యమే’ అని బదులిచ్చారు.దీనిపై రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ‘ఏదైనా సాధ్యమే అనేది సాంకేతికంగా నిజమే.
ల్యాబ్ స్థాయి సాంకేతికత, సరిపడా వనరులు ఉంటే విమాన నియంత్రణతో సహా ఏ వ్యవస్థనైనా హ్యాక్ చేయవచ్చని, కానీ ఈ వాదన ఈవీఎంలకు వర్తించదన్నారు. పేపర్ ఓటింగ్‌తో పోలిస్తే ఈవీఎంలు సురక్షితమైనవని, నమ్మదగినవని పేర్కొన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏదైనా సాధ్యమే’ అన్నప్పుడు ఈవీఎంల హ్యాకింగ్ కూడా సాధ్యమే కదా అన్నారు. భారతీయ ఈవీఎంలను దేవుడు రక్షిస్తున్నాడా? అని ప్రశ్నించారు.
ఈవీఎంను పరిశీలించే అనుమతి లేదు: రాహుల్
ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ భారత రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఇదే సమయంలో ముంబైలో శివసేన(ఏక్నాథ్ షిండే) ఎంపీ రవీంద్ర వైకర్ బావమరిది కౌంటింగ్ కేంద్రంలో ఫోన్‌తో ఈవీఎంను అన్‌లాక్ చేశాడనే వార్తలు కూడా రావడంతో ఒక్కసారిగా ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మస్క్ ట్వీట్‌పై స్పందించారు.
ఈ విషయమై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘భారత్‌లో ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’గా మారాయి. ఎవరూ వీటిని పరిశీలించడానికి అనుమతి లేదు. మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి. సంస్థల్లో జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుంది. మోసానికి గురవుతుంది.’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘సాంకేతికత అనేది సమస్యలను తొలగించాలి.
ఒకవేళ సమస్యలను కలిగిస్తే దానిని వెంటనే నిలిపివేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపర్ చేసే ముప్పు ఉందని ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు చెప్తున్నప్పుడు బీజేపీ ఎందుకు ఈవీఎంలను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నదో స్పష్టం చేయాలి’ అని డిమాండ్ చేశారు.