Maharashtra | ముంబై, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. దీపావళి తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 13న జిల్లాల కలెక్టర్లతో ఈసీ సమీక్ష నిర్వహించనుంది. కాగా, అధికారాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్)తో కూడిన మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగుతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌ను కొనసాగించి రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్)తో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రయత్నిస్తున్నది. దీంతో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారం ఎవరిదో నిర్ణయించడంతో పాటు శివసేన, ఎన్సీపీల భవిష్యత్తును కూడా తేల్చేయనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కూటములకు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే సర్వేల జోరు మొదలయ్యింది. అయితే, పలు ప్రాంతాల్లో మహాయుతి, ఇంకొన్ని ప్రాంతాల్లో మహా వికాస్ అఘాడీకి సానుకూలత ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. విదర్భలోని 62 సీట్లలో మహా వికాస్ అఘాడీ అధిపత్యం ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఖాందేష్‌లోని 47 సీట్లలో రెండు కూటములకు సమానంగా విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కంచుకోట అయిన థాణేతో పాటు కొంకణ్ బెల్ట్‌లోని 39 సీట్లలో మాత్రం మహాయుతి కూటమికి మొగ్గు కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. థాణేలో షిండే వైపు నిలుస్తున్న మరాఠా ఓటర్లు ముంబైలో మాత్రం ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా ఉన్నారని, ముంబై బెల్ట్‌లోని 36 నియోజకవర్గాల్లో మహాయుతిపై మహా వికాస్ అఘాడీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవార్ కుటుంబానికి పట్టున్న పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లతో పాటు, మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో మహా వికాస్ అఘాడీకి సానుకూలత ఉన్నట్టు చెప్తున్నారు. మహాయుతి కంటే మహా వికాస్ అఘాడీకే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తున్నదని లోక్‌పోల్ సర్వే పేర్కొన్నది.
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి కేవలం 17 సీట్లతో సరిపెట్టుకోగా, మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, శాంతిభద్రతలు దెబ్బతినడం, అధిక ధరలు, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడం, మరాఠాల రిజర్వేషన్ల ఉద్యమం, నిరుద్యోగం, మహారాష్ట్ర నుంచి పలు ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లిపోవడం వంటి అంశాలు మహాయుతి కూటమికి వ్యతిరేకంగా మారాయి. మరోవైపు మూడు పార్టీల మధ్య సమన్వయలేమి, సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి అంశాలు మహా వికాస్ అఘాడీకి ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.