న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. దీని నిర్వహణ విషయమై చర్చించడానికి ఈ నెల 10న అన్ని రాష్ర్టాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశం కానుంది. జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టాక ఈ తరహా సమీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.
ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాదిలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు ఓటర్ల జాబితాను నవీకరించాలని ఈసీ భావిస్తున్నది. అనర్హుల పేర్లు తొలగించి లోప రహిత, కచ్చితమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయడం కోసం ‘సర్’ను చేపట్టినట్టు ఈసీ పేర్కొన్నది.
ఈ ప్రక్రియలో భాగంగా విదేశీయులు, మరణించినవారు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పేర్లను తొలగించనున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వలసదారులపై చర్యలు తీసుకుంటారు. ‘సర్’లో భాగంగా బూత్ స్థాయి అధికారుల ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారు.