న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana elections) పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. అయితే అక్టోబర్ 1న జరగనున్న జమ్ముకశ్మీర్ ఎన్నికల మూడో దశ పోలింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల కౌంటింగ్, ఫలితాల తేదీని అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8కు మార్పు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
కాగా, శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్‌కు భారీగా తరలివెళ్లడంపై జాతీయ, రాష్టీయ రాజకీయ పార్టీలు, అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి ఫిర్యాదులు అందినట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై ప్రభావం చూపవచ్చన్న వాదనలతో హర్యానా ఎన్నికల పోలింగ్ తేదీతోపాటు కౌంటింగ్ తేదీని మార్పు చేసినట్లు పేర్కొంది.