Killer wolfs | ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ (Bahraich) జిల్లాలో తోడేళ్లు (Killer wolfs) మరోసారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేసిన విషయం తెలిసిందే. వాటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి ఈ తోడేళ్లు వరుస దాడులకు పాల్పడుతున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరాయిచ్లో తోడేళ్ల దాడిలో తాజాగా ఓ వృద్ధ దంపతులు మరణించారు. దంపతులు పొలం వద్ద ఉండగా తోడేలు వారిపై దాడి చేసింది. వారి శరీరాలను చీల్చి చెండాడింది. ఈ దాడిలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా దాడితో గ్రామంతోపాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరోసారి భయాందోళన వాతావరణం నెలకొంది.
తోడేళ్ల వరుస దాడులతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారుల్ని (forest officials) గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. వారిపై కర్రలతో దాడి చేశారు. గ్రామస్థుల దాడిలో అధికారుల వాహనం ధ్వంసమైంది. అయితే, రెండు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో ఓ తోడేలును అంతం చేసినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ తెలిపారు. దాని మృతితో గ్రామస్థులు కాస్త ఊపిరిపీల్చుకున్నారని.. ఇప్పుడు తాజా దాడి వారిలో భయాన్ని రేకెత్తించినట్లు వివరించారు.
తోడేళ్లు కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నాయని స్థానికులు తెలిపారు. వాటి దాడిని నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రాంతంలో భద్రతను పెంచడానికి, తోడేళ్ల కదలికలను పర్యవేక్షించేందుకు పోలీసుల సమన్వయంతో అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కూడా తోడేళ్లు బహరాయిచ్ (Bahraich) ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేశాయి. దాదాపు రెండు నెలలుగా రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేశాయి. వీటి దాడుల్లో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ భేడియా చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఆ కిల్లర్ ఊల్ఫ్స్ని బంధించారు. ఇప్పుడు మరోసారి అవి ప్రజలపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
LPG Cylinder Prices Hike | పండుగల వేళ పెరిగిన గ్యాస్ ధర.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.15.50 వడ్డన..!
Mallikarjun Kharge | ఆసుపత్రిలో చేరిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే..
Weather Update | అక్టోబర్‌లోనూ దంచికొట్టనున్న వర్షాలు.. వెల్లడించిన భారత వాతావరణశాఖ..