Mallikarjun Kharge | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతో ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సమాచారం మేరకు.. జ్వరంతో బాధపడుతుండడంతో మంగళవారం బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఇంట్లో స్వల్పంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యలు స్పష్టం చేశారు.
అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను వైద్యుల పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. జ్వరానికి కారణాలు గుర్తించేందుకు పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఖర్గే ఆసుపత్రిలో చేరారన్న వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు ట్వీట్ చేశారు. మల్లికార్జున్ ఖర్గే వయను 83 సంవత్సరాలు. ఆయన సీనియర్ పార్లమెంటేరియన్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఒకరు. అక్టోబర్ 2022 నుంచి ఆయన ఏఐసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.