LPG Cylinder Prices Hike | గ్యాస్ ధరలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. పండుగ వేళ గ్యాస్ భారం స్వల్పంగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ప్రకటించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.15.50 మేరకు పెంచినట్టు ప్రకటించాయి. దాంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1595.50కి పెరిగింది. కీలక పండుగలకు ముందు వాణిజ్య సిలిండర్ గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడే హోటల్స్, రెస్టారెంట్లతో పాటు పలు రంగాలను ప్రభావితం చేయనున్నది. సవరించిన రేట్ల ప్రకారం.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.15.50 పెరగ్గా.. ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.1,595.50 పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో రూ.1,547, చెన్నైలో రూ.1,754, కోల్‌కతాలో రూ.1,700కి పెరిగింది. ఇక 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేదు. దాంతో గృహ గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించినట్లయ్యింది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ముంబయిలో రూ.852.50, ఢిల్లీలో రూ.853, చెన్నైలో రూ.868.50, కోల్‌కతాలో రూ.879, హైదరాబాద్‌లో రూ.925గా ఉన్నది.
వాస్తవానికి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, ప్రభుత్వ విధానాలు, పన్ను విధానంలో మార్పులు, డిమాండ్ సరఫరాల్లో సీజనల్ మార్పులు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఆయిల్ కంపెనీలు ఖర్చులు ఆదాయం తదితర అంశాల ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తూ వస్తాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం సామాన్యులపై పడకుండా ప్రభుత్వం గృహవినియోగ సిలిండర్ల ధరలను నియంత్రిస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుండడంతో జనాలకు ఊరట కలుగుతున్నది. అయితే, వాణిజ్య సిలిండర్ల ధరలను మాత్రం ప్రతినెలా మారుతుంటాయి. ఒక్కో సందర్భంలో ధరలు తగ్గుతుంటాయి. అయితే, గత సెప్టెంబర్‌లో ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ధరలు పెరగడంతో హోటల్స్, క్యాటరింగ్ సేవలు తదితర వాణిజ్య సంస్థలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ రోజువారీ కార్యకలాపాల కోసం ఎల్పీజీపైనే ఆధారపడుతుంటాయి. సిలిండర్ ధర పెరగడంతో ఈ వ్యాపారాల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను వినియోగదారుల నుంచి రాబట్టేందుకు ధరలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read More :
Weather Update | అక్టోబర్‌లోనూ దంచికొట్టనున్న వర్షాలు.. వెల్లడించిన భారత వాతావరణశాఖ..
October Bank Holidays | ఈ అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు మూసివేత.. సెలవుల ఫుల్ లిస్ట్ ఇదే..!