Weather Update | వర్షాకాలం సీజన్ మంగళవారంతో ముగిసింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైందని భారత వాతావరణశాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహాపాత్ర వెల్లడించారు. రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురిశాయని.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం సహా అనేక విపత్కర ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు నెలల కాలంలో సాధారణ వర్షాపాతం 868.6 మిల్లీమీటర్లతో పోలిస్తే 937.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందన్నారు. సాధారణం కంటే 8శాతం ఎక్కువగా ఉందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం తర్వాత అక్టోబర్ మాసంలో భారత్లో సాధారణం కంటే 15శాతం ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
అక్టోబర్లో ఈశాన్య, వాయువ్య భారత్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహాపాత్ర పేర్కొన్నారు. అయితే, మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా, సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈశాన్య రుతుపవనాల సీజన్లో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. అయితే, వాయువ్య భారత్లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, సాధారణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా.. రుతుపవనాల సీజన్లో తూర్పు, ఈశాన్య భారత్లో 1089.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 1367.3 మి.మీ కంటే 20 శాతం తక్కువ. బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో ఈ సీజన్లోని నాలుగు నెలల్లో మూడు నెలలు తక్కువ వర్షాపాతం నమోదైందని ఐఎండీ డీజీ తెలిపారు. తూర్పు-ఈశాన్య భారతంలో 1901 తర్వాత రెండోసారి అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. ఈ ప్రాంతంలో రుతుపవనాల సమయంలో అత్యల్ప వర్షపాతం (1065.7 మి.మీ) 2013లో నమోదైంది. ఇటీవల కాలంలో తూర్పు, ఈశాన్య భారత్లో చాలా సంవత్సరాలుగా తక్కువ వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. 2020 నుంచి ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైందని.. గత 20 ఏళ్లలో తూర్పు-ఈశాన్య భారత్లో వర్షపాతం తగ్గిందని కూడా అధ్యయనాలు చూపిస్తున్నాయి.
వాయువ్య భారత్లో 747.9 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇది సాధారణ వర్షపాతం (587.6 మి.మీ) కంటే 27.3 శాతం ఎక్కువ అని మోహాపాత్ర వెల్లడించారు. 2001 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని.. 1901 తర్వాత ఆరవ అత్యధిక వర్షపాతమని వెల్లడించారు. మధ్య భారతంలో 1125.3 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం 978 మి.మీ కంటే 15.1 శాతం ఎక్కువని చెప్పారు. దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం 716.2 మి.మీ కంటే 9.9 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. వాయువ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అక్టోబర్లో భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక సగటు 75.4 మి.మీ కంటే 115 శాతం ఎక్కువగా ఉంటుందన్నారు.
భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్నాటకలో ఈశాన్య రుతుపవనాల సమయంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా (112శాతం కంటే ఎక్కువ) ఉండే అవకాశం ఉన్నది. 1971 నుంచి 2020 డేటా ప్రకారం.. దక్షిణ ద్వీపకల్ప భారతంలో ఈ సీజన్లో సాధారణ దీర్ఘకాలిక సగటు వర్షపాతం 334.13 మి.మీ. దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో సగటు సాధారణ వర్షపాతం 75.4 మి.మీ., ఈసారి వర్షపాతం 115శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనాల అభివృద్ధి.. అలాగే కాలానుగుణ హెచ్చుతగ్గుల కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు ముత్యుంజయ్ మోహాపాత్ర వెల్లడించారు.