Eknath Shinde | న్యూఢిల్లీ, నవంబర్ 27 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్డీఏ పక్షాలకు స్పష్టతనిచ్చినట్టు తెలుస్తున్నది. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఏక్నాథ్ షిండే పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం దక్కనుంది. దీంతో సీఎం నుంచి డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండేకు డిమోషన్ దక్కినట్టయ్యింది. గురువారం మహారాష్ట్రలోని ఎన్డీఏ పార్టీల నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు.
ఫడ్నవీస్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపుతున్న విషయం స్పష్టం కావడంతో షిండే అనివార్యంగా వెనక్కు తగ్గారు. సీఎం పదవిపై బీజేపీ తీసుకునే నిర్ణయానికి తాను పూర్తి సహకారం అందిస్తానని, ఈ ప్రక్రియకు తాను ఎలాంటి ఆటంకం కాబోనని బుధవారం ఆయన ప్రకటించారు. ‘నేను ఎప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్’ అని ఆయన వ్యాఖ్యానించారు.