Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ సీఎం (Maharashtra CM) ఎవరన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తాజాగా వెల్లడించారు.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లతో కూడిన మహాయుతి కూటమికి మెజారిటీ వచ్చినా సీఎం ఎవరన్న సంగతి తేలలేదు. సీఎం అభ్యర్థి ఖరారు విషయమై గురువారం దేశ రాజధానిలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో సానుకూల చర్చలు జరిగినట్లు తెలిపారు. సీఎం పదవిపై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపారు. మిత్రపక్షాల మధ్య మంచి సమన్వయం ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) మహా తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్డీఏ పక్షాలకు స్పష్టతనిచ్చినట్టు తెలుస్తున్నది.
ఇక ముఖ్యమంత్రితోపాటు సగానికిపైగా మంత్రి పదవులను (Maharashtra Cabinet) బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో సీఎంతో సహా అత్యధికంగా 43 మంది మంత్రులను నియమించుకునే వీలుంటుంది. ఇందులో షిండే నేతృత్వంలోని శివసేనకు (Shinde Sena) 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో షిండే వర్గానికి మూడు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, జలవనరులు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
Also Read..
Parliament Winter Session | ఆగని రభస.. రాజ్యసభ సోమవారానికి వాయిదా
Raj Kundra | పోర్న్ రాకెట్ కేసు.. రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
Putin: డోనాల్డ్ ట్రంప్ సేఫ్గా లేరు.. పుతిన్ ఆందోళన