మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. సురక్షితంగా లేరన్న అభిప్రాయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) వ్యక్తం చేశారు. ట్రంప్ క్షేమంగా లేరన్నారు. కజకస్తాన్‌లోని అస్తానాలో జరిగిన సీఎస్‌టీవో సదస్సులో పుతిన్ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీర పట్ల పుతిన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో అనాగరిక పద్ధతిలో పోరు జరిగిందన్నారు. అనేక మార్లు ట్రంప్‌పై హత్యాయత్నాలు కూడా జరిగినట్లు చెప్పారు. నా దృష్టిలో ట్రంప్ సేఫ్‌గా లేరని పుతిన్ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ జరగని రీతిలో అనేక సంఘటనలు ఇటీవల జరిగినట్లు తెలిపారు.
ట్రంప్‌పై ప్రశంసలు కురపించారు పుతిన్. ఆయన అనుభవం ఉన్న, ఇంటెలిజెంట్ నాయకుడన్నారు. ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ బుల్లెట్ ఆయన చవిలోంచి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఓ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ సెప్టెంబర్‌లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో ఓ వ్యక్తి నుంచి ఆయుధాలను సీజ్ చేశారు.